అప్పుడు ఫ్రెంచ్ డైరెక్టర్,ఇప్పుడు సీమ రచయిత,గురూజీ ఎందుకిలా? అరవింద సమేత కథ తనదే అంటూ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ప్రముఖ రచయిత..

Trivikram Aravinda Sametha Story Controversy

Trivikram Aravinda Sametha Story Controversy

మాటల మాంత్రికుడిగా పేరున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తరచుగా ,కాపీ వివాదాలు వెంటాడుతున్నాయి.. ఈ ఏడాది విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం తన ఫ్రెంచ్ చిత్రం నుంచి హక్కులు తీసుకోకుండా యథాతథంగా దించేసారు అంటూ ఒక ఫ్రెంచ్ దర్శకుడు అప్పట్లో కేసు పెట్టేవరకూ వెళ్లగా,తాజాగా త్రివిక్రమ్ తాజా చిత్రం “అరవింద సమేత ” కూడా ఇదే మాదిరి వివాదంలో ఇరుక్కుంది..

అయితే ఈ సారి ఆరోపణలు చేసింది మాములు వ్యక్తి కాదు,ఏకంగా ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అవార్డు పురస్కారం అందుకున్న రచయిత వేంపల్లి గంగాధర్.. త్రివిక్రమ్ ని ఒక తెలివైన మూర్ఖుడుగా అభివర్ణించిన గంగాధర్,తాను రచించిన వివిధ రచనల్లోని ఒక్కో పాత్రని దొంగిలించి అరవింద సినిమా తీసారు అంటూ తన ఆవేదనను సోషల్ మీడియా లో పంచుకున్నారు..

ఇక తాను రాసిన ఏ ఏ పుస్తకాలు,నవలలోని పాత్రలు తన అనుమతి లేకుండా,కనీసం సినిమా టైటిల్స్ లో తన పేరు కూడా వేయకుండా,ఎలా మోసం చేసారో గంగాధర్ తన సుదీర్ఘమైన పోస్టులో వివరించారు..

త్రివిక్రమ్ ఒక మొండి కత్తి:
————————-
త్రివిక్రమ్ నుంచి మొదటి సారిగా

ఏప్రిల్ 15 వ తేదీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలు కానున్న సందర్భం. హుటాహుటిన వెళ్ళాను. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారు. షాట్ గ్యాప్ లో పరిచయం అయ్యింది. నా పుస్తకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రాయలసీమ ఫ్యాక్షన్ కథల పై పరిశోధన చేసి సర్టిఫికెట్ పొందిన విషయం విని అభినందించారు. పరిశోధన లో పడిన ఇబ్బందులు, అందులో కొంత సమాచారం ” హిరణ్య రాజ్యం” పుస్తక రూపం రావడాన్ని వారి దృష్టికి తెచ్చాను.

సినిమాలో హీరోయిన్ పాత్రకు దీన్ని వాడుకున్నారు. తర్వాత సాయంత్రం ఆరు గంటలకు తనతో పాటూ సితార హోటల్ కు కారు లో తీసుకెలుతూ దారిలో రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారు.హోటల్లో వారి గది లో కూర్చొని నేను రాసిన ఫ్యాక్షన్ కథల వివరాలు అడిగారు. పాపాగ్ని కథల్లో ఉన్న మొదటి కథ ‘మొండి కత్తి’ నేపధ్యం గురించి చెప్పమన్నారు .

ఇంత వరకు నేను రాసిన కక్షల కథలు -అందులోని కథల మూలాల గురించి అడిగి తెలుసుకున్నారు.సినిమాలో పదే పదే వచ్చే మొండి కత్తి కథ కు పునాది అదే.అతడిని కలవడం , నా కథల గురించి లోతుగా చెప్పడం నేను చేసిన మొదటి తప్పు. మూడు రోజులు నేను వారితో కలిసి ఉచితంగా వర్క్ చేశాను.తెర పైన పేరు వేయకుండా ఇతరుల కథలను వాడుకునే స్వభావం ఉన్న దర్శకుడి ని కలవడం వల్ల ఇలా కూడా మనం మోసపోతూ ఉంటాం.

త్రివిక్రమ్ ఒక తెలివైన మూర్ఖుడు. మనం రాసిన అన్ని కతల్లోంచి ఒక్కో పాత్ర ను దొంగిలించి ఇంకో కొత్త రకం వంటకం వండ గలడు. అలా వండిన కథే అరవింద సమేత!


అంటూ ఒక పోస్టులో వివరించారు గంగాధర్.. ఇక ఈ విషయమై చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ స్పందించాల్సి ఉంది.. ఇదిలా ఉండగా ఈ నెల 12 న విడుదలైన అరవింద సమేత చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది,అయితే పండుగ సీజన్ కావడంతో వసూళ్ళలో మాత్రం తన సత్తా చూపిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed