హాలీవుడ్ కాదు,అంతకు మించి.. 2.O తెలుగు సినిమా రివ్యూ..

2PointO Movie Review

2PointO Movie Review

మూడున్నరేళ్లుగా ఎప్పుడెప్పుడా అని రజనీకాంత్ ప్రేక్షకులే కాకుండా,యావత్ సినీ ప్రేక్షకులూ ఆతృతగా ఎదురు చూస్తున్న సినీ అద్భుతం 2.O ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది.. మొదటి భాగం రోబో అప్పట్లో పెను సంచలనం సృష్టించగా,ఈ 2.O అంతకు మించిన హంగులతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.. మరి ఈ 2.O ప్రేక్షకుల అంచనాలు అందుకోగలిగిందా?

కథేంటి?

వశీకర్(రజినీకాంత్) రూపొందించిన చిట్టి అనే రోబో ని నాశనం చేయడం ద్వారా మొదటి భాగం అంతమైతే,ఈ 2.O కథ మాత్రం వశీకర్ ని కొంత మంది విద్యార్థుల బృందం కలవటంతో మొదలవుతుంది.. చిట్టి వెన్నెల(ఆమీ జాక్సన్) అనే రోబో ని రూపొందిస్తారు..ఇక చెన్నై నగరంలో అనూహ్యంగా సెల్ ఫోన్లు మాయం అయిపోతుంటాయి,అంతే కాకుండా సెల్ ఫోన్ డీలర్,ఇంకా ఒక టెలికాం ఆపరేటర్ ,కమ్యూనికేషన్ మంత్రి కూడా సెల్ ఫోన్లతో హత్య గావించబడతారు.. ఈ విషయమై రాష్ట్రం అట్టుడుకుపోతుండగా వశీకర్ రంగంలోకి దిగుతాడు..

తన రీసెర్చ్ ద్వారా ఈ సెల్ ఫోన్ల మాయం,ఇంకా హత్యల వెనుక ఉన్నదీ పక్షి రాజా (అక్షయ్ కుమార్) అని కనుక్కుంటాడు.. అయితే ఆ పక్షిరాజా ని అంతం చేయడం కోసం మిలటరీ కూడా ఫెయిల్ అవ్వడంతో చిట్టి ని రంగంలోకి దింపుతాడు వశీకర్.. మరి చిట్టి పక్షి రాజా ని అంతం చేస్తాడా? పక్షి రాజా చేసే హత్యలు,సెల్ ఫోన్ల మాయం వెనుక కారణం ఏమిటి?ఇది స్థూలంగా కథ..

సినిమా ప్రథమార్ధం మొత్తం ఊహించని మలుపులతో సాగింది ,సెల్ ఫోన్లు మాయం అయిపోవడం,అనూహ్యంగా హత్యలు ,ఇలా ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు , గ్రాఫిక్స్, చాలా ఉంటాయి ప్రథమార్ధంలో.. వశీకర్ ఎంతో కష్టపడి పక్షి రాజా ని కనుక్కోవడం,చిట్టి సహాయంతో అతను ఉన్న ప్రదేశానికి చేరడంతో ప్రథమార్ధం ముగుస్తుంది..

ఇక ద్వితీయార్ధంలో పక్షిరాజా ఎందుకు ఇంత భీబత్సం సృష్టిస్తున్నాడో కొంచెం బోరింగ్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు..పక్షి రాజా అంత మధన పాడడం వల్లే ఈ బీభత్సాలు చేస్తున్నాడు అనే జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం అంత పొడుగు ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదనిపిస్తుంది.. ఇక పక్షిరాజా ని పని పట్టేసాం అనుకున్న సమయంలో మరొకరు అతనికి తిరిగి ప్రాణం పోయడంతో కథ మళ్ళీ మొదటికొస్తుంది.. అనూహ్యంగా పక్షిరాజా వశీకర్ లోకి ప్రవేశించడం,చిట్టి,వెన్నెల కలిసి వశీకర్ ని రక్షించి పక్షిరాజా ని అంతం చేయడం ఇవన్నీ కొంచెం ఎక్కువ సమయం చూపించినట్లు అనిపించింది..

ఇక ప్రీ క్లయిమాక్స్ లో అనూహ్యంగా 3.0 ని కూడా చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేసారు దర్శకుడు.. సినిమా లో హీరోయిన్ పాత్ర లేకపోవడంతో పాటలు పెద్దగా తెలియవు,నేపధ్య సంగీతం,చివరిలో ప్రత్యేక గీతంగా వచ్చిన యంత్రలోకపు సుందరిగా పాట బాగుంది..

2.O సినిమా కి ప్రధాన హీరో గ్రాఫిక్స్,vfx వర్క్ ,మూడున్నరేళ్లు చిత్ర బృందం పెట్టిన శ్రమ ఇందులో కనిపించింది.. చాలా క్వాలిటీ గా ఉంది.. 3D చిత్రం కూడా కావడంతో ప్రేక్షకులు చాలా థ్రిల్ కి గురవుతారు.. ముఖ్యంగా పక్షి రాజా ఎంట్రీ సీన్,చిట్టి ఎంట్రీ,విశ్రాంతి కి ముందు వచ్చే చిట్టి- పక్షి రాజా పోరాట సన్నివేశాలు, ఇక స్టేడియం లో జరిగే పతాక సన్నివేశాలు ఇలా ప్రతి సన్నివేశంలో అత్యుత్తమ గ్రాఫిక్స్ కనిపిస్తాయి..

రజిని కాంత్ నటనకి పేరు పెట్టె అవకాశమే లేదు,ఇక 2.O,3.O రోబో పాత్రల్లో కూడా అయన పలికే పంచ్ డైలాగ్స్ అభిమానులతో ఈలలు వేయించాయి.. వెన్నెల గా అమీ జాక్సన్ నటన బాగుంది.. ఇక సినిమా లో ముఖ్య పాత్ర పక్షి రాజా గా వృద్ధుడి పాత్రలో అక్షయ్ కుమార్ అయితే తన నటనలో విశ్వరూపం చూపించారు..పక్షుల కోసం పోరాడి ఓడిపోయే ఒక మంచి మనిషిగా,సమాజం మీద పగబట్టిన క్రూరుడిగా రెండు పాత్రల్లో జీవించారు అక్షయ్..


మనుషులతో పాటు పక్షులకి కూడా భూమి మీద బ్రతికే హక్కు ఉంది అనే చక్కటి సందేశం చుట్టూ కథ రాసుకున్నారు శంకర్.. ఇవే కాకుండా సెల్ ఫోన్స్ మనిషి కి ఎలా వ్యసనంగా మారాయో కూడా చాలా చక్కగా చూపించారు.. అయితే ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి ఉంటె బాగుండేది.

మొత్తం మీద హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా (ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు పైనే) 2.O చిత్రం,ప్రతి ఫ్రేమ్ ఆసక్తికరంగా,అద్భుతమైన గ్రాఫిక్స్ తో మిస్ అవ్వకూడని చిత్రం ఈ 2.O..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed